ఉప్పల్‌లో లారీ ఢీకొని విద్యార్థి మృతి

హైదరాబాద్‌: ఉప్పల్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎదుట.. స్కూల్‌ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అన్న అవంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ టైరు కిందపడి తల ఛిద్రమైంది. మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా హబ్సిగూడలోని భాష్యం స్కూల్‌లో చదువుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే  లారీ వదిలి డ్రైవర్‌ పరారయ్యాడు. విద్యార్థిని తల్లిదండ్రుల రోదనలతో ప్రమాద స్థలం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.