ప్రేక్షకాదరణ సంతోషాన్ని ఇస్తోంది:అర్చన

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఎంఆర్‌ భారతి దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, సీనియర్‌ నటి అర్చన, రేవతి కలిసి నటించిన చిత్రం 'అళియాద కోలంగళ్‌'. మూడు వారాల క్రితం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రకాశ్‌రాజ్, రేవతి, అర్చన నటనకు ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా పలు పత్రికలు ఈ చిత్రాన్ని అభినందిస్తూ విశ్లేషణలు రాశాయి. కొన్నిరోజుల క్రితం భాగ్యరాజ్‌ దీనిపై స్పందించారు. మనసును హత్తుకునే సినిమాను చూసి భావోద్వేగంతో కంటతడి పెట్టుకుని చాలా కాలమైందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కథ, ఆలోచన తనకు ఇంత వరకు రాకపోవడాన్ని చూసి అసూయగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ 'ప్రేక్షకుల నుంచి ఇలాంటి మంచి స్పందన రావడంలోనే మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని తెలుస్తుంది. సినిమా విలువ తెలిసిన ఎంతో మంది మమ్మల్ని అభినందిస్తుండం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతాయని' చెప్పారు. రేవతి మాట్లాడుతూ 'మా చిత్రానికి చక్కని స్పందన రావడం అదృష్టం. ఇప్పుడున్న కథానాయికల ట్రెండ్‌ను చూస్తుంటే భయమేస్తోంది. ఇలాంటి కాలంలో నేను పరిశ్రమలోకి వచ్చి ఉంటే అంతగా రాణించేదాన్ని కాదేమో అనిపిస్తోంది. కథానాయికల మధ్య ఎక్కువ పోటీ నెలకొంది' అని పేర్కొన్నారు.