దీపికను ఇంప్రెస్‌ చేసిన కంగన


ముంబయి: 'పంగా' సినిమా ట్రైలర్‌ నచ్చిందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె అన్నారు. కంగనా రనౌత్‌ నటించిన సినిమా ఇది. అశ్వనీ అయ్యర్‌ తివారీ దర్శకురాలు. భారత మహిళా కబడ్డీ జట్టులో స్థానం సంపాదించుకోవాలని కలలు కన్న ఓ మహిళగా కంగన కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన దీపిక స్పందించారు. 'నాకు సమయం దొరికినప్పుడల్లా సినిమాల ట్రైలర్లు చూస్తుంటా. ఓ ప్రేక్షకురాలిగా వీటిని చూస్తాను. 'పంగా' ట్రైలర్‌ నన్ను ఎంతో ఇంప్రెస్‌ చేసింది. ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని దాన్ని బట్టి అర్థమౌతోంది' అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కంగన సోదరి రంగోలీ దీపికకు ధన్యవాదాలు చెప్పారు.


ఇలా దీపిక కంగనను మెచ్చుకోవడం ఇది తొలిసారి కాదు. 2014లో 'హ్యాపీ న్యూఇయర్‌' సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న దీపిక దాన్ని 'క్వీన్‌'లో అద్భుతంగా నటించిన కంగనకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. 'ఛపాక్‌' సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో దీపిక ఈ విషయం గురించి మాట్లాడారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. జనవరి 10న విడుదల కాబోతోంది. మేఘనా గుల్జార్‌ దర్శకురాలు.